అమీన్‌పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి
రాత్రి కురిసిన భారీ వర్షాలకు అమీన్‌పూర్ పరిధిలోని సాయిరాం ఫేస్-1 మరియు నరేంద్ర కాలనీ టర్నింగ్ పాయింట్ వద్ద రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లడానికి దారి లేక రోడ్లపైనే నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
*అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం*
ఈ సమస్యపై కాలనీవాసులు మాట్లాడుతూ, “గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అధికారులకు పలుమార్లు విన్నవించినా, వారు కేవలం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న దుర్గా ప్రవీణ్ నగర్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*జీహెచ్ఎంసీకి హెచ్చరిక*
ఈ సందర్భంగా కాలనీ మాజీ అధ్యక్షులు ఎల్ల స్వామి మాట్లాడుతూ, ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించాలని డిమాండ్ చేశారు. కాలనీల ముంపు సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో త్వరలోనే భారీ స్థాయిలో ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు.